వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం అంటే ఏమిటి? ఈ పథకం లబ్ధిదారులెవరు? ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగింది? తదితర అంశాలపై అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు అధికారులు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తి కానుంది. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జూన్ 22, 2022 నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. మరో 2400 గ్రామాల్లో ఆగస్టు 2022 నాటికి పూర్తి అవుతుందని వెల్లడించారు. మొత్తంగా ఆగష్టు 2022 నాటికి 5500 గ్రామాల్లో సర్వే పూర్తయినట్టవుతుందని అధికారులు తెలిపారు. 3 వేల గ్రామాల్లో అక్టోబరు 2022 నాటికి, మరో 3వేల గ్రామాల్లో డిసెంబరు 2022 నాటికి, మరో 3వేల గ్రామాల్లో మార్చి 2023 నాటికి సర్వే పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. జూన్, 2023 నాటికి మరో 3 వేల గ్రామాలతో కలుపుని…. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు సర్వే వివరాలివీ..
– పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వే చేశామని అధికారులు తెలిపారు.
– 3549 పట్టాదారుల వివరాలను అప్డేట్ చేశాం
– రెవిన్యూ నుంచి 572 , సర్వే వైపు నుంచి వచ్చిన 1480 అభ్యర్థనలను పరిష్కరించాం.
– 235 సరిహద్దు వివాదాలను పరిష్కరించాం.
– సంబంధిత రికార్డులను అప్డేట్ చేయడమే కాకుండా వాటిని స్వచ్ఛీకరించాం.
– సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నాం.
క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్డేట్ కావాలి: సీఎం ఆదేశం
భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి రికార్డుల్లోనూ, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్డేట్ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
– అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలి
– దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలి
– ల్యాండు రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో పెట్టాలి.
– వీరు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి ఎస్ఓపీలు రూపొందించాలి.
– గ్రామ సచివాలయాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలి.
– ప్రజలు వీటికోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన ఎస్ఓపీ రూపొందించాలి.
– ల్యాండ్ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలి
– తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలి.
– సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
– ల్యాండ్ రికార్డుల అప్డేషన్ను ప్రతి ఏటా ఒక వారంలో చేపట్టాలి. దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలి.
– ల్యాండ్ రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలి.
– మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటులేని విధంగా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలి.
– సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలి.
– గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
– 22ఎ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.
– అధికారులు కూర్చొని దీనిపై ఒక విధానం తీసుకురావాలి.
– ఇలాంటి తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలి.
– తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలి.
– నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలి.
– దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతంచేయాలి.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ (సర్వే, సెటిల్మెంట్స్) సిద్దార్ధ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, పురపాలక, పట్టణాభివద్ధిశాఖ కమిషనర్ ఎం ఎం నాయక్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.