మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అలాంటిదిలాంటిది కాదు. కాస్త బాగా ఆడితే చాలు. ఆటగాళ్లను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అదే సమయంలో విఫలమయ్యారా ఇక అంతే సంగతులు. వారికి చుక్కలు చూపించేస్తారు. బుధవారంనాటి ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఇలాంటి ఉదంతమొకటి చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, కొల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. Trolling on Dhoni daughter Ziva
చెన్నై ఓడిపోవడంతోనే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది. సాధారణంగా క్రికెటర్లనే కాక వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్లను సైతం తిట్ల దండకంతో ఈ దురభిమానులు సన్మానిస్తుంటారు. ఇపుడు అది మరీ పరిధులను దాటిపోయింది. క్రికెటర్ల సంతానాన్ని కూడా బలిచేసే పరిస్థితి వచ్చేసింది.

ఈసారి ధోని ఆరేళ్ల కూతురు జివాపై ట్రోలింగ్ జరిగింది. ఆ పసిపాపపై దాడిచేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే స్థాయికి క్రికెట్ అభిమానులు దిగజారారు. ధోని, అతని భార్య సాక్షి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఈ అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులు కనిపించాయి.
ఈ మ్యాచ్లో ధోని 12 బంతులను ఎదుర్కొని 11 పరుగులే చేసి 17వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి చెన్నై గెలవాలంటే 21 బంతుల్లో 39 చేయాల్సి ఉంది. మరోవైపు కేదార్ జాదవ్ కూడా 12 బంతుల్లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. దాంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
