Peoples Front against Modi కేంద్రాన్ని ఢీకొట్టడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? అన్ని పార్టీలూ ఉమ్మడిగా ఏదైనా కార్యాచరణకు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత ధృఢమైన స్థాయిలో ఫ్రంట్ ఏర్పడబోతున్నదనే దానిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రయత్నాలు కొత్తవేమీ కాదు. జాతీయ పార్టీ బలంగా ఉన్న తరుణంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావడం సాధారణమైన పరిణామమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా బలంగా ఉన్న రోజుల్లో కూడా నేషనల్ ఫ్రంట్లు, యునైటెడ్ ఫ్రంట్లు అనే ప్రయోగాలు అనేకం జరిగాయి. అయితే ఎన్నికలకు ముందు అలాంటి ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందా..
ఇపుడే ఎందుకు ఈ ఫ్రంట్?
భారతీయ పార్టీ బలంగా ఉండి వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నించే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో వీళ్లంతా ఏకమవుతున్నారు. మన దేశంలో ప్రాంతీయ పార్టీల లక్షణమేమిటంటే వాటికి ఒక విధానపరమైన, సైధ్ధాంతిక పరమైన, రాజకీయ పరమైన వైఖరులంటూ ఏమీ ఉండవు. వాళ్లకి వాళ్ల రాజకీయప్రయోజనాలే ప్రధానమైనవి. వాటికి ఇబ్బంది లేనంత వరకు అవి ఎలాంటి పోరాటాలూ, ప్రయత్నాలూ చేయవు. ఇందుకు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ఒక ఉదాహరణ. మొదటి ఎన్డీఏ ప్రభుత్వంలో మమత మంత్రిగా ఉన్నారు. ఇపుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు వస్తున్నారు. కారణమేమిటంటే 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ బెంగాల్లో 18 సీట్లు గెలుచుకుంది.ఇవాళ అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా 37 శాతం ఓట్లు తెచ్చుకుంది కనుక సహజంగానే మమతకు బీజేపీ ప్రధాన శత్రువుగా మారింది. అలాగే తెలంగాణలో 2019లో బీజేపీ 4 సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్కు ఒక ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు వచ్చింది. అందుకే టీఆర్ఎస్ కూడా బీజేపీని శత్రువుగా చూస్తోంది. అలా తమ మనుగడకు ముప్పు లేనంత వరకు జాతీయ పార్టీల విషయంలో ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉంటాయి.
ఫెడరల్ స్ఫూర్తి కాదు మనగడకు ప్రమాదం..
ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిల్లడం వల్లనే ప్రాంతీయ పార్టీలు తిరగబడుతున్నాయన్న వాదనపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఇలా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం ఏర్పడిందా? 2019కి ముందు కూడా బీజేపీ అనేక రాష్ట్రాల హక్కులకు భంగం కలిగేలా అనేక చర్యలు తీసుకుంది. జీఎస్టీ విధానం తీసుకురావడమే రాష్ట్రాల పన్ను ఆదాయాలకు కత్తెర వేయడం కదా.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 7 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి 2019లోక్ సభ ఎన్నికలలో 20శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత దుబ్బాకలో, హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్కు భారీగా దెబ్బ కొటì ్టంది. దాంతో తమ మనుగడకు బీజేపీ ప్రమాదకరంగా మారుతున్నదని గుర్తించి టీఆర్ఎస్ తిరగబడుతోంది. ఫెడరల్ స్ఫూర్తికి బీజేపీ గతంలోనూ విఘాతం కలిగించింది.. ఇపుడూ కలిగిస్తోంది. అలాగే శివసేన బీజేపీతో అనేక దశాబ్దాల పాటు కలసి ఉంది. ఇపుడు ఆ పార్టీ మనుగడకు ప్రమాదం కలుగుతోంది కనుక తిరగబడుతోంది.
పీపుల్స్ ఫ్రంట్ సాధ్యమవుతుందా..
మార్చిలో భావసారూప్య పార్టీలన్నీ ఏకమవుతున్నాయని, ఒక ఫ్రంట్‌గా ఏర్పడబోతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. దాని పేరు పీపుల్స్ ఫ్రంట్ అని కూడా ఆయన నామకరణం చేశారు. ఈ ఫ్రంట్‌లో తాను కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్ అంటున్నారు. కూటమి ఏర్పాటుకు మమత, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే పూర్తిగా సహకరిస్తున్నారని వినిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి ఫ్రంట్ ఏర్పడడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ పార్టీలకు వచ్చే సీట్ల ఆధారంగా ఫ్రంట్ కట్టే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ పార్టీలు ఒకదానికొకటి సహకరించుకునే అవకాశమే లేదు. ఏ పార్టీ బలం ఆ రాష్ట్రానికే పరిమితం. ముందు ఈ పార్టీలు తమ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా తగిన వ్యూహాలు రూపొందించుకుని, మంచి సంఖ్యలో సీట్లు సాధించి ఢిల్లీకి వస్తే ఉపయోగముంటుంది. అపుడు ఏర్పడే ఫ్రంట్ వల్ల ఆ పార్టీలకూ ఉపయోగముంటుంది.