ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలకు Andhra Govt Decisions న్యాయస్థానంలో చుక్కెదురు.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. జీవోల కొట్టివేత.. నిర్ణయాలపై స్టే.. తరచుగా వినిపిస్తున్న మాటలివి. సంక్షేమంలో పరుగులు పెడుతున్నా.. అనేక ఇబ్బందుల్లోనూ అభివృద్ధి బాటలో నడుస్తున్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి ( YSJaganmohan Reddy ) కి ఈ తలనొప్పులు తప్పడం లేదు. అధికారులు సరిగా పనిచేయడంలేదా? ప్రభుత్వ అడ్వకేట్లు సరిగా వాదించడం లేదా..? లేక ప్రభుత్వ నిర్ణయాలే తప్పా? సామాన్యుడికి ఎదురౌతున్న ప్రశ్నలివి..
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, దిశ బిల్లు, స్థానిక ఎన్నికలు, పేదల ఇళ్ల స్థలాలు, జస్టిస్ కనగరాజ్ ఉదంతం, తాజాగా టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితులు ఇలా.. అనేక నిర్ణయాలలో కోర్టుల నుంచి చుక్కెదురైంది. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోగానే అధికారులు దానిని అమలు పరచడానికి తగిన కార్యాచరణను సిద్ధం చేస్తారు. సాంకేతిక పరమైన చిక్కులున్నా, న్యాయపరమైన అడ్డంకులున్నా వాటిని గుర్తించి తగిన పరిష్కారాలతో సహా ఆ కార్యాచరణను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అది అధికారుల బాధ్యత.
కానీ ప్రభుత్వం నిర్ణయం Andhra Govt Decisions తీసుకోగానే అడ్డంకులను అధిగమిస్తూ అమలు చేయడానికి తగిన కార్యాచరణ సిద్ధం కావడం లేదు. కొన్ని సందర్భాలలో అలాంటి కార్యాచరణ సిద్ధం చేసేలోపు గానే ప్రతిపక్షం న్యాయస్థానం తలుపు తడుతోంది. మన రాష్ట్రంలో ప్రతిపక్షం చాలా యాక్టివ్ కదా.. ప్రజా సమస్యలపై కన్నా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడంలో ప్రతిపక్షం యాక్టివ్. ఇది ఆరోపణ మాత్రమే కాదు. తెలుగుదేశం పార్టీ ఈ రెండున్నరేళ్లలో చేసిన ప్రజా ఉద్యమాల కన్నా కోర్టుల్లో వేసిన కేసుల సంఖ్యే ఎక్కువ. అందుకని అలా అనవలసి వచ్చింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ప్రతిపక్షనేతగా ఉన్నపుడు ప్రభుత్వ పెద్దలు ఆయన అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా.. అధికారులు ఎలా పనిచేస్తారో.. ఏ అంశంపై న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అవుతాయో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన కోటరీలోని అనుభవజ్ఞులైన సలహాదారులకు ఇది ఇంకా బాగా తెలుసు. అలాంటి అనుభవం ఉన్నవారిని ఎదుర్కోవాలంటే ఇంక ఎంత చురుకుగా పనిచేయాలి? కానీ అలాంటి చురుకుదనం ప్రభుత్వంలో లోపించింది. అంటే అధికారులలో లోపించింది. అది సహజంగానే లోపించిందా? లేక కావాలని అలా యాక్ట్ చేస్తున్నారా అన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నది విశ్లేషకుల మాట.
Also Read : ఇది పేపరా.. పేపర్ కు పట్టిన పీడా ? ఈనాడు పై జగన్ ఫైర్
ఇదే నియమం అధికార పార్టీ అడ్వకేట్లకూ వర్తిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో తలపండిపోయిన, న్యాయవ్యస్థలో అనేక సత్సంబంధాలలున్న అనుభవజ్ఞులైన టీమ్‌ను వారు ఎదుర్కొంటున్నారు. అంటే ఎంత చురుకుగా ఉండాలి? ఎంత వేగంగా స్పందించాలి? ఒక అంశాన్ని ఎంత లోతుగా పరిశీలించాలి? ఎన్ని కోణాల్లో ఆలోచించాలి? కానీ అలా జరగడంలేదని అనేక కేసుల్లో రుజువౌతోంది. ఎదురుదెబ్బలే అందుకు సాక్ష్యాలు. ఏమన్నా అంటే ప్రతిపక్షం వ్యవస్థను మేనేజ్ చేస్తున్నదని ప్రభుత్వంలోని కొందరు సీనియర్లు, పార్టీ అధికార ప్రతినిధులు విలేకరుల సమావేశాల్లో సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చాలా పొరపాటని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే న్యాయవ్యవస్థ మొత్తం ఒకరికి దాసోహం కాదు. ఎవరో కొందరు అటు ఇటు ఒరిగేవారుంటారు. అన్ని వ్యవస్థలలోనూ ఇది కనిపిస్తుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల తటస్థంగా, న్యాయబద్ధంగా పనిచేసే వారిలోనూ ఒక రకమైన విముఖత పెరుగుతుంది. ఆ వ్యాఖ్యల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
తాజాగా ప్రభుత్వానికి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD Tirumala Tirupati Devasthanams ) ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఈనెల 15న జీవో 569ని జారీ చేసింది. కానీ ఏ చట్టానికి లోబడి, ఏ రూల్ కింద దేవస్థానానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తున్నారో జీవోలో పేర్కొనలేదు. టీటీడీ బోర్డు ( TTD Board ) గురించి తప్ప ప్రత్యేక ఆహ్వానితుల గురించి టీటీడీ చట్టంలో లేదు. అంటే ఇది సాంకేతిక పరమైన అంశం. ప్రత్యేక ఆహ్వానితులను నియమించే అధికారం ప్రభుత్వాధినేత వైఎస్ జగన్‌కు లేదా అంటే ఉంది. కానీ ఆ నిర్ణయం తీసుకునేటపుడే ఎదురయ్యే సాంకేతిక పరమైన అంశాలు, న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచించాల్సింది. ఈ నిర్ణయం తీసుకునేటపుడే దేవాదాయ, ధర్మాదాయ చట్టాలను మార్చాల్సి ఉంది. లేదంటే రూల్స్‌ను సవచించాల్సి ఉంది. అవేమీ లేకుండా జీవో ఇచ్చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సింది సీనియర్ అధికారులే కదా? కానీ అది జరగలేదు. ప్రభుత్వానికి తలవంపులు తప్పలేదు.