దేశంలో బీజేపీ పరిస్థితి బాగోలేదని ఇటీవలి ఉప ఎన్నికలు తేల్చేశాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా దాని పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట్ల ఓటమిపాలయ్యింది. ఉప ఎన్నికలలో ఓటమి చూసిన తర్వాతనే పెట్రోలు ధరలను నామమాత్రంగానైనా తగ్గించింది. ఒకవైపు సుదీర్ఘకాలంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయస్థానాలలోనూ ఎదురుదెబ్బలు తింటోంది. ABP CVoter Survey
కీలక రాష్ట్రాలలో ఎన్నికలు
ఈ నేపథ్యంలో నాలుగు కీలకమైన రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలలో కూడా అతి ముఖ్యమైనది ఉత్తరప్రదేశ్. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గెలుపు రానున్న కాలంలో నరేంద్ర మోదీ గెలుపునకు చాలా కీలకమని హోంమంత్రి అమిత్‌షా ఇటీవల యూపీలో పర్యటిస్తూ వ్యాఖ్యానించారు. కానీ లఖింపూర్‌ఖేర్ ఘటన వంటి వాటివల్ల యూపీలో బీజేపీ పరిస్థితి ఎదురీతలా ఉంది. ఇదే సమయంలో శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఏబీపీ – సీఓటర్ ఒక సర్వే ABP CVoter Survey జరిపింది.
యూపీలో బొటాబొటీ మెజారిటీ..!
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి రావచ్చని ఆ సర్వేలో తేలింది. గతంలో వచ్చిన స్థానాలలో ఒక వందకు పైగా స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. మెజారిటీకి కొద్దిగా అటుఇటుగా అంటే దాదాపు 220 స్థానాలు మాత్రం రావచ్చని ఈ సర్వే తేల్చింది. సర్వేలు ఏవీ యథాతథంగా నిజం కావాలన్న సూత్రమేమీ లేదు. ఈ సర్వేను చూస్తే బొటాబొటీ మాత్రమే కాదు మెజారిటీకి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని కూడా భావించడానికి అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌కు 150 నుంచి 160 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. బీఎస్పీ మాత్రం బాగా దెబ్బతినిపోతుందని, ఆ పార్టీకి 18 స్థానాలకు మించి రావని సర్వే పేర్కొంది. వాస్తవానికి బీజేపీకి ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఉత్తరప్రదేశ్ ఫలితాల ప్రభావం కేంద్రంలో అధికారంలోకి రావడంపై ఉంటుందని వేరేచెప్పనక్కరలేదు. అమిత్‌షా మాటల అంతరార్థం కూడా అదే.
Also Read : పంజాబ్ పిల్ల పూనమ్ కౌర్ మళ్లీ వాతపెట్టిందిగా..
పంజాబ్‌లోనూ చుక్కెదురే..
ఇక పంజాబ్ విషయానికి వస్తే అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అయినా అక్కడ కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలబెట్టకుంటుందని, దాదాపు 45 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఇక్కడ బీజేపీకి చాలా తక్కువ స్థానాలు వస్తాయని, రెండోస్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందని సర్వే తెలిపింది. ఈ రెండు కాకుండా చిన్నరాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలలో బీజేపీనే గెలుస్తుందని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాలలో ఫలితాలపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు.
జాతీయ రాజకీయాలపై ప్రభావం
బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో స్థానాలు కోల్పోవడం, పంజాబ్‌లో గెలవలేకపోవడం జాతీయ రాజకీయాలలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికలపై ఈ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ అధినాయకత్వమంతా యూపీపై కేంద్రీకరిస్తున్నారు. మోదీ యూపీలో పలుమార్లు పర్యటిస్తున్నారు. పంజాబ్‌లో కూడా వారు కేంద్రీకరించారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తుపెట్టుకుంటామని అంటున్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికిప్పుడు స్పందించకపోయినా రానున్న కాలంలో ఏ అవకాశాన్నీ వదులుకోబోరని గత అనుభవాలు రుజువు చేస్తున్నాయి. యూపీలో కూడా బీజేపీకి సీట్లు తగ్గుతాయి కానీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే చెబుతోంది. అయినా ఎన్నికల నాటికి ఇంకా అనేక పరిణామాల ప్రభావం ఆ ఫలితాలపై ఉండే అవకాశం ఉంది.