celebrity lawyer ఆర్యన్ ఖాన్ కేసు వాదిస్తోంది ఈయనే..దేశంలోని ఖరీదైన లాయర్లలో ఒకరు.. రోజుకు రూ.10లక్షల ఫీజు..! సెలెబ్రిటీల కేసులన్నీ ఆయనకే.. రాంజెఠ్మాలాని వద్ద పదేళ్లు శిష్యరికం..

సతీష్ మానే షిండే.. ఈ పేరు అందరికీ తెలియకున్నా బాలీవుడ్లో, క్రిమినల్ లాయర్లకు మాత్రం సుపరిచితం. ఆయన కేసు ఒప్పుకున్నారంటే అదే ‘పది లక్షలు’. క్రిమినల్ కేసులు వాదించడంలో ఆయన అంతటి పేరు సంపాదించారు. కోర్టులో కేసు నెగ్గాలన్నా.. బెయిల్ రావాలన్నా లాయర్ కీలకం. చట్టాలన్నీ ఔపోసన పడితే గానీ కొన్ని కేసుల్లో బెయిల్ ఇప్పించడమూ అంత సులభం కాదు. ప్రముఖులు, సినీ నటుల కేసుల్లో అయితే అందరి దృష్టి ఉంటుంది. ఎన్నో క్లిష్టతరమైన కేసుల్లో బెయిల్ ఇప్పించి.. ఎంతోమంది ప్రముఖులను బయటకు రప్పించారు లాయర్ సతీష్ మానే షిండే. ప్రస్తుతం ఈయన పేరు బాలీవుడ్లో, మీడియాలో మరోసారి మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ కూడా ఆయననే నమ్ముకున్నారు. దేశంలోని ప్రముఖ లాయర్లలో ఒకరు..
రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ అరెస్టు కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్ తరఫున ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పేరొందిన సతీష్ మానే షిండే వాదనలు వినిపిస్తున్నారు. దేశంలోని ఖరీదైన లీడింగ్ లాయర్లలో ఆయన ఒకరు. సోమవారం ముంబయి హైకోర్టు ఆర్యన్‌ఖాన్ తరఫున బెయిల్ కోసం వాదనలు వినిపించారు.
వాదనలో దిట్ట.. celebrity lawyer
లాయర్ సతీష్ మానే షిండే ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు, నటుల కేసులు వాదించి చట్టాలపై తనకున్న పట్టును రుజువు చేసుకున్నారు. క్లిష్టతరమైన కేసుల్లో బెయిల్ ఇప్పించారు. రాజకీయ నాయకులు, నటులు, ఇతర ప్రముఖుల కేసులు వాదించారు. ఆయన కేసును వాదిస్తే రోజుకు రూ.10లక్షలు ఫీజు తీసుకుంటారని సమాచారం. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌కు చెందిన సతీష్ మానే షిండే న్యాయ విద్యను అక్కడే అభ్యసించారు. ఆ తర్వాత ముంబయికి మకాం వచ్చారు. దేశంలోని ప్రముఖ క్రిమినల్ లాయర్ దివంగత రాంజెఠ్మాలాని వద్ద జూనియర్ లాయర్‌గా పని చేశారు. ఆయన వద్ద సుమారు పదేళ్లు జూనియర్‌గా ఉన్నారు. ఆ తర్వాత సొంతగా ప్రాక్టీస్ చేస్తున్నారు..
నటుల కేసుల్లో..
1993లో ముంబయి బాంబు పేలుళ్ల కేసులు నిందితుడిగా సినీ నటుడు సంజయ్ దత్ కేసును ఈయనే వాదించారు. తన వాదనల ద్వారా బెయిల్ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. సంజయ్ దత్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో 2007లో ఆయన తరఫున వాదించిన లాయర్ల బృందంలోనూ సతీష్ ఉన్నారు. 2002లో మరో నటుడు సల్మాన్ ఖాన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనూ ఆయన తరఫున సతీష్ లాయర్‌గా వాదనలు వినిపించారు. బెయిల్ ఇప్పించారు. తర్వాత కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. గత ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎన్సీబీ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. ఈ కేసులోనూ బెయిల్ ద్వారా వారిద్దరిని బయటకు రప్పించారు. ముంబయి పోలీసు ఇన్స్పెక్టర్ దయానాయక్ కేసు, శోభన్ మెహతా మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులోనూ ఈయనే లాయర్‌గా వ్యవహరించారు.