మొత్తానికి మా (MAA Movie Artists Association) ఎన్నికలు ముగిశాయి. వాదనలు, విమర్శలు, తిట్లు, శాపనార్థాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, తాయిలాలు, మేనిఫెస్టోలు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో.. సాధారణ ఎన్నికలకు మించి మా ఎన్నికల హంగామా సాగింది. చివరకు విజేతగా మంచు విష్ణు నిలిచాడు. ప్రకాష్‌రాజ్ పరాజయం పాలయ్యాడు. మంచు ప్యానెల్లో ఆఫీస్‌బేరర్లు ఎక్కువమంది గెలిచారు. ప్రకాష్‌రాజ్ ప్యానెల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎక్కువమంది విజేతలుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నికలు ముగిశాక వస్తున్న స్పందనలు ఎక్కువమందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి స్పందన గురించే…
అయినా ఇపుడా చెప్పాల్సింది…
మా ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో చిరంజీవి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆ వేదిక పైనుంచే ఆయన మా ఫలితాలపై మాట్లాడారు. ‘‘ చిన్న చిన్న ఈగోల కోసం పంతాలకు పోవద్దు. మనదంతా వసుదైక కుటుంబం. ఆధిపత్యం కోసం ఎవరినీ కించపరచవద్దు. ‘మా’ పరువు తీయవద్దు. ఈ పదవులు చాలా చిన్నవి. తాత్కాలికం. వీటికోసం పంతాలకు పోవద్దు. చాలా తక్కువ కాలం ఈ పదవిలో ఉంటారు. బయటివాళ్లకు లోకువయిపోతాం పదవులకోసం ఇలా ఉండాలా.. అందరం మెచ్యూరిటీతో ఉండాలి. ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రయత్నించకూడదు.’’ ఇలా సాగింది చిరంజీవి స్పందన. ఇండస్ట్రీ పెద్దగా, పెద్ద హీరోగా పరిగణించబడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మాటలు చెప్పాల్సింది ఎప్పుడు? ఎన్నికల సమరం ముమ్మరంగా సాగుతున్న సమయంలో, మాటలు హద్దులు మీరుతున్న తరుణంలో మెగాస్టార్ ఏమీ మాట్లాడలేదు. సంయమనం పాటించాల్సిందిగా ఎవరికీ చెప్పలేదు.
సరికొత్త వివాదం.. ఎవరికి మందేయాలి?
ఇంకా చిరంజీవి ఏమన్నారంటే.. ‘‘ వివాదాలు ఎక్కడ మొదలవుతున్నాయో చూడాలి. అలాంటి వాళ్లకు హోమియోపతి మందు వేయాలి. హోమియోపతి మందు మూలాల్లోకి వెళుతుంది. రోగాన్ని నయం చేస్తుంది. వివాదాలకు కారణమౌతున్న వారిని దూరం పెట్టాలి.’’ అని పిలుపునిచ్చారు.
వివాదం ఎక్కడ మొదలయ్యింది?
మరి చిరంజీవి చెప్పినట్ల మా ఎన్నికలలో వివాదం ఎక్కడ మొదలయ్యింది? రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా పెద్దలు ప్రభుత్వాలపై తిరగబడాలని, చిరంజీవిగారు సౌమ్యుడని, సౌమ్యంగా ఉంటే కుదరదని, మోహన్‌బాబు కూడా స్పందించాలని లేదంటే స్కూళ్లపైనా ఈ ప్రభుత్వాలు పడతాయని ఉద్వేగ పూరిత ప్రసంగం చేయడంతో మా ఎన్నికలలో అసలైన వేడి మొదలయ్యింది. ఇక్కడే ప్రకాష్ రాజ్ ప్రస్తావన కూడా పవన్ కల్యాణ్ తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ తనకు అంతగా తెలియదని అంటూనే ఆయనకు మద్దతిస్తున్నట్లు పరోక్షంగా చెప్పారు. దాంతో మోహన్‌బాబు పూర్తిగా రంగంలో దిగారు. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారు. అక్కడి నుంచి మా ఎన్నికల తీరు మారిపోయింది. సమయం దగ్గరపడే కొద్దీ బలమైన రెండు వర్గాల మధ్య పోటీగా ఇది మారింది. ఎన్నికలకు మరో రెండు రోజులున్నాయనగా మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని రగిల్చాయి. పుండుపై కారం చల్లాయి. వ్యాఖ్యలకు ప్రతివ్యాఖ్యలతో వీడియోలు రిలీజ్ అయ్యాయి.
దాసరి స్థాయికి చిరంజీవి ఎప్పుడు చేరుకుంటారు?
ఇలాంటి సందర్భాలలో ఎప్పుడు కూడా చిరంజీవి స్పందించలేదు. ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి ఏం చెబుతారా అన్నిచూసింది. ఆయన మాట్లాడితే చాలా నోళ్లు మూతపడేవి. ఆయన వారిస్తే చాలా వివాదాలు సమయసిపోయేవి. ఆయన హెచ్చరిస్తే అందరూ హద్దుల్లో ఉండేవారు. చిరంజీవి తాను ఏ పక్షం వహిస్తున్నానో చెప్పనక్కరలేదు. ఇపుడు ఎన్నికలు ముగిసిన తర్వాత చెప్పిన మాటలే ముందు చెప్పడానికి ఏమయ్యింది? ఒకప్పుడు దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్దగా ఉండేవారు. ఇలాంటి సందర్భాలలో ఆయన అందరి నోళ్లు మూయించేవారు. ఇపుడు అలాంటి పాత్ర చిరంజీవి పోషించాలని అందరూ కోరుకున్నారు. ఎవరు చెబితే ఓ వివాదం ఆగిపోతుందో.. ఎవరు చేయి చూపిస్తే గొడవపడేవారు ఆగిపోతారో వారే ఇండస్ట్రీ పెద్ద అని ఒక సందర్భంలో మోహన్ బాబు అన్నారు. అలాంటి పెద్ద ఇపుడు చిరంజీవి అని కూడా ఆయన అన్నారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ కూడా ఇదే అభిప్రాయాన్ని ఒకానొక సందర్భంలో వెలిబుచ్చారు. ఇపుడు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే అని ఆయన అన్నారు. కానీ ఆ పెద్దరికం ఏది? మా ఎన్నికలలో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే చిరంజీవి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు? ఫలితాలు వెలువడిన తర్వాత ఈ మాటలెందుకు? ఇపుడు జరగాల్సిందేమిటి? గొడవ అయిపోయిందిగా.. ఫలితాలు వచ్చేశాయిగా.. విజేతలను అభినందించాల్సింది పోయి గొడవ పడొద్దని అనడమేమిటి? తమ కుటుంబం మద్దతిచ్చిన వారు ఓడిపోయారన్న అక్కసు తప్ప ఇందులో ఏం కనిపిస్తుంది..
మనసులు గెలుచుకున్న ప్రకాష్‌రాజ్
ప్రకాష్ రాజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా ట్రెండ్స్ కనిపించగానే ఓడిపోతామనుకున్న వారు లెక్కింపు జరిగే ప్రాంతం నుంచి వెళ్లిపోతారు. కానీ ప్రకాష్ రాజ్ అలా చేయలేదు. అక్కడే చివరి వరకు ఉండి గెలిచిన వారినందరినీ అభినందించారు. అందరం కలసి పనిచేద్దామని, తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాతే అక్కడి నుంచి వెళ్లారు. అదీ పెద్దరికమంటే.. ఓడిపోయినా టీవీలు చూస్తున్నవారందరి మనసులను ప్రకాష్ రాజ్ గెలుచుకున్నాడు..