మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నరేష్ లాంగ్ లీవ్ ఎందుకు పెట్టారు? ఆయన కావాలనే సెలవు పెట్టారా? లేక ఎవరన్నా వత్తిడి చేశారా? అసలు మా లో ఏం జరుగుతోంది? బెనర్జీని అధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టి ఏం చేయబోతున్నారు? సినీ పెద్దలు వేసిన పథకం ఏమిటి? అది మా ను గాడిలో పెడుతుందా లేక పరిస్థితి మరింత దిగజారుతుందా.. MAA President Naresh Long leave ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం..
అందులో భాగంగానే ..
సినిమాలలోనే కాదు మా అసోసియేషన్‌లో ఏం జరిగినా ప్రేక్షకులకు అంతే ఆసక్తి ఉంటుంది. ఇటీవలి కాలంలో మా లో జరుగుతున్న సంఘటనలు ఈ ఆసక్తిని మరింత పెంచేశాయి. ముఖ్యంగా మా అధ్యక్షుడు నరేష్ తీరుపై తరచుగా దుమారం చెలరేగుతోంది. నటీనటులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టడం కోసం సినీ పెద్దలు నడుం బిగించారు. తెరవెనుక పెద్ద పథకాన్ని సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ముందుగా నరేష్ చేత లాంగ్ లీవ్పెట్టించారని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.
తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ
మా అధ్యక్షుడుగా ఉన్న నరేష్ 41 రోజుల పాటు సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు సెలవులో ఉన్నాడు కనుక ఆయన పరోక్షంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న బెనర్జీ ( Maganti Venu Banerjee ) ని తాత్కాలిక అధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదంతా సాధారంగా జరిగే ప్రక్రియే. కానీ మా లో ఇటీవల జరిగిన సంఘటనలను బట్టి ఇది సాధారణ ప్రక్రియగా అనిపించడం లేదు. దీనివెనుక ఏదో మతలబు ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మా అధ్యక్షుడిగా నరేష్ తీసుకుంటున్న నిర్ణయాలు మా లో సభ్యులుగా ఉన్న నటీనటులకు రుచించడం లేదు. కొన్ని నిర్ణయాలు సినీ పరిశ్రమ పెద్దలకు కూడా ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. గతంలో ఫండ్ రైజింగ్ పేరిట అమెరికాలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ సంసందర్భంగా కలెక్ట్ చేసిన డబ్బు విషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి.
అధ్యక్షుడికి అనేక విశేష అధికారాలు
మా నిబంధనల ప్రకారం అధ్యక్షుడికి అనేక విశేష అధికారాలున్నాయి. చెక్‌పవర్ ఉంటుంది. సొంతంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అధికారం కూడా ఉంది. అధ్యక్షుడి పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా కమిటీ సభ్యులకు అధికారం ఉండదు. ఒకవేళ అధ్యక్షుడి తీరు నచ్చకపోయినా భరించాల్సిందే. మధ్యలో దించేయడం కుదరదు. ఇలాంటి విశేషాధికారాలను మా అధ్యక్షుడు నరేష్ దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఇపుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుకే అధ్యక్షుడి విశేషాధికారాలను కత్తిరించాలని సినీ పెద్దలు నిర్ణయించారట.
Also Read : అదరగొట్టిన ‘వకీల్‌సాబ్’ ఫస్ట్‌లుక్‌లో ఓ లోపముందంట తెలుసా..
సినీ పరిశ్రమ పెద్దలంతా ఒక్కమాటపై ..
ఇటీవలే సినీ పెద్దలు చిరంజీవి, మురళీమోహన్, కృష్ణంరాజు, జయసుధ తదితరులతో కూడిన మా క్రమశిక్షణా కమిటీ సమావేశమయింది. మా అధ్యక్షుడి విశేషాధికారాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటిని మార్చాలని అందుకు అవసరమైతే మా బైలాస్‌లో కూడా మార్పులు చేయాలని నిర్ణయించారట. ఆ మార్పులు చేసే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ తన సీటులో ఉండడం భావ్యం కాదని భావించి సినీ పెద్దలు సెలవులో వెళ్లాల్సిందిగా నరేష్‌ను కోరారని, ఆయన అందుకు అంగీకరించి వెంటనే సెలవు పెట్టారని సమాచారం. సినీ పరిశ్రమ పెద్దలంతా ఒక్కమాటపై ఉండడంతో సెలవు పెట్టడం మినహా నరేష్‌కు మరో గత్యంతరం లేకుండా పోయిందని అంటున్నారు.
నరేష్ సెలవు పెట్టగానే ఉపాధ్యక్షుడుగా ఉన్న బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా చేశారు. ఒకానొక సమయంలో బెనర్జీ మీటింగ్‌కు వస్తుంటే బైటకు పొమ్మని నరేష్ గదమాయించారని అంటారు. ఇపుడు అదే బెనర్జీ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. నరేష్ అధికారాలకు కత్తెర వేసే కాగితాలపై ఆయనే సంతకాలు చేయనున్నారు.
బైలాస్‌లో మార్పులు
ఇకపై మా అధ్యక్ష స్థానంలో ఉన్న ఎవరైనా సరే తోక జాడిస్తే ఆయనను ఆ పదవి నుంచి తొలగించే అధికారం కమిటీకి ఉండేలా బైలాస్‌లో మార్పులు చేయబోతున్నారు. నరేష్ నాయకత్వంలో మా కమిటీ ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో ఈ కమిటీ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కమిటీకి మరో ఏడాది గడువు ఉంది. అన్నిటికన్నా మించి అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవలసిన అనేక అంశాలను వివాదాస్పదం చేసి మా పరువును రోడ్డున పడేశారన్న విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. సినీ పెద్దలు కూడా ఈ విషయంలో బాగా చికాకుగా ఉన్నారని సమాచారం.
అందుకే కీలకమైన నిర్ణయాలు తీసుకుని మా ను గాడిలో పెట్టాలని సినీ పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నారట. మరి ఈ నిర్ణయాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలంటే కొద్దికాలం ఆగాల్సిందే..