MAA Association చేసిన మొట్టమొదటి పని ఏదో తెలుసా..?

MAA Association చేసిన మొట్టమొదటి పని ఏదో తెలుసా..?

0 0
Read Time:7 Minute, 5 Second

మా MAA Association (Movie Artists Association )ఎప్పుడు ఏర్పడింది? ఏ ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశారు? మొట్టమొదటగా అది చేసిన పని ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే కొద్దిగా వెనక్కు వెళ్లాలి…

తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌ వచ్చేసిన తర్వాత చాలా కాలం నటీనటులకు ఒక అసోసియేషన్‌ అంటూ ఏదీ లేదు. పోలీసు శాఖ సంక్షేమం కోసం విశాఖలో నటీనటులతో ఒక బెనిఫిట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. దానిని ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి ప్లాన్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 60 మంది నటీ నటులు ఆ మ్యాచ్‌కు హాజరయ్యారు. వారికోసం సుబ్బిరామి రెడ్డి ఒక ప్రత్యేక విమానాన్ని బుక్‌ చేశారు. తిరిగి వస్తుండగా విమానంలోనే చిరంజీవి, కృష్ణంరాజు తదితరుల వద్ద మురళీ మోహన్‌ ఈ అసోసియేషన్‌ ప్రతిపాదన చేశారని, దానిని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని తెలుస్తోంది. ఆ మర్నాడే అందరూ మురళీ మోహన్‌ ఇంటిలో సమావేశమయ్యారు. అలా మా పురుడుపోసుకుంది.

మద్రాసులో ఉండగా నటీనటులకు ఒక అసోసియేషన్‌ ఉండేది అది అమ్మ.. దానికి కృష్ణంరాజు అధ్యక్షుడుగా ఉండేవారు. అలానే అమ్మ అని వచ్చేలాగా మా ( MAA ) ని (హిందీలో అమ్మ) అనుకోవడం జరిగింది. బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకున్న అమ్మ బొమ్మ కనిపించేలా బాపు ఒక బొమ్మ వేశారు. ఇప్పటికీ అదే లోగోను వాడుతున్నారు. ఒక పెద్ద నటుడు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచించి చిరంజీవిని అడిగారు. ఆ బాధ్యతకు ఆయన సరే నన్నారు. ప్రధానకార్యదర్శిగా మురళీమోహన్‌ ముందుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు తదితర సీనియర్‌ నటులు సలహాదారులుగా ఉన్నారు. మిగిలిన కమిటీ కూడా అలానే ఎంపికచేశారు. అలా మా తన పనిని మొదలుపెట్టింది. రెండేళ్లపాటు మురళీమోహన్‌ నివాసంలోనే మా కార్యకలాపాలు సాగాయి. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్‌ 4న అసోసియేషన్‌ MAA Association కార్యాలయం ఏర్పాటుచేశారు.

నిర్మాతలతో నటీనటులకు వస్తున్న గొడవలు, నిర్మాతలు, దర్శకులకు నటీనటులతో వచ్చే ఇబ్బందులపై చర్చించి ఆ సమస్యలన్నిటినీ సానుకూలంగా పరిష్కరించడం మా అసోసియేషన్‌ ప్రధాన లక్ష్యం అని అందరూ అనుకుంటారు. నటీనటుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యమని చాలామంది భావిస్తారు. మా ఏర్పడిన తొలినాళ్లలో దీని మోటో ఇది కాదు. మా చేస్తున్న పనుల్లో ఇవి ఉన్నాయి. కానీ ప్రధాన ఉద్దేశం మాత్రం వేరే ఉంది. అదేమిటో తెలుసా.. నటీనటుల్లో ఎవరైనా చనిపోతే వాళ్లు అనాథల్లా మాత్రం పోకూడదు. వారిని సకల లాంఛనాలతో గౌరవప్రదంగా సాగనంపాలి. అనాథల్లా మున్సిపాలిటీ బండిలో శవం వెళ్లే పరిస్థితి ఉండకూడదు. అన్నది మా అసోసియేషన్‌ MAA Association ప్రధాన ఉద్దేశం. తొలి రోజుల్లో నటీనటులంతా తలా కొంచెం విరాళాలు వేసుకుని అంత్యక్రియల పనులు పూర్తిచేసేవారు. అలా మా అసోసియేషన్‌ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా వారు గుర్తించిన అనాథ శవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఐదు నంది అవార్డులను, ఒక జాతీయ అవార్డును అందుకుని తెలుగు నటీనటుల ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ప్రముఖ నటుడు పీఎల్‌ నారాయణ తన చివరి రోజుల్లో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. ఒకసారి ఆయన పనిమీద రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. అమీర్‌పేట్‌లో తన ఇంటి సమీపంలోనే ఆ అద్దెకారులో ఆయన మరణించారు. ఆయన ఎవరో కారు డ్రైవర్‌కు తెలియదు. మాసిన గడ్డం, సరైన దుస్తులు లేని పీఎల్‌ నారాయణను అక్కడ చాలామంది గుర్తుపట్టలేకపోయారు. చివరికి ఎవరో గుర్తుపట్టి ఆయన ప్రముఖ నటుడని, ఆయన ఇల్లు ఇక్కడే అని ఆ ఇంటికి తీసుకువెళ్లారు. నారాయణకు నా అన్నవారెవరూ లేరని, అనాథలా ఇలా పోయారని మురళీమోహన్‌కు ఎవరో చెప్పారు. మా అసోసియేషన్‌ MAA Association కు తొలినాళ్లలో నిధులు లేవు. సొంత భవనమూ లేదు. మురళీ మోహన్‌ ఇల్లే మా కార్యాలయం. వెంటనే అందరూ తలా కొంచెం వేసుకుని పీఎల్‌ నారాయణ అంత్యక్రియలను ఎవరూ ఊహించని విధంగా గ్రాండ్‌గా పూర్తిచేశారు. అలా మా అసోసియేషన్‌ చేసిన తొలి పని ఇది. ఆ తర్వాత ప్రముఖ నటుడు, విఖ్యాత విలన్‌ రాజనాల విషయంలోనూ అంతే. ఆయన కూడా అనాథలా ఛాతీ ఆస్పత్రిలో పడి ఉంటే ఆయనను కూడా మా అసోసియేషన్‌ ఆదుకుంది. గాంగ్రిన్‌తో కాలు తీసేయాల్సి వస్తే ఆపరేషన్‌కు, ఆ తర్వాత ఆయన మరణిస్తే అంత్యక్రియలకు, ఆయన వెంట ఉన్న వారిని ఆదుకోవడానికి మా అసోసియేషన్‌ చాలా ఖర్చు చేసింది. రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మా సభ్యులు చాలా కృషి చేశారు.

ఇపుడు మా అసోసియేషన్‌కు నిధులు ఉన్నాయి. త్వరలో భవనం కూడా సమకూరనుంది. చానళ్లు పెరిగి ప్రచారం పెరగడంతో మా ఎన్నికలు ఏ స్థాయిలో కలకలం సృష్టించాయో చూశాం. కానీ నటీనటుల సంక్షేమం విషయంలోనూ, మా ప్రథాన మోటో విషయంలోనూ కొత్త కార్యవర్గం ఎలా స్పందిస్తుందో, బాధ్యతలను ఎలా నెరవేరుస్తుందో చూడాలి..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *