ప్రముఖ బాలీవుడ్నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో పెద్ద దుమారాన్ని రేపాయి. ముంబై సహా అనేక ముఖ్య పట్టణాలలో కంగనాపై కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ పలు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆమెకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వెనక్కు తీసుకోవాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు కంగనాను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. శివసేన అధికారపత్రిక సామ్నాలో కంగనాను విమర్శిస్తూ పెద్ద సంపాదకీయం రాశారు. Kangana Freedom Comments
కంగనా ఏమన్నది?
ఇంతకీ కంగనా ఏమన్నదో చూద్దాం.. ‘‘భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది. 1947లో వచ్చినది నిజమైన స్వాతంత్య్రం కాదు. అది అడుక్కుంటే వచ్చింది.’’. అని కంగనా వ్యాఖ్యానించింది. చరిత్ర పట్ల ఎలాంటి అవగాహనా లేని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలివి. సమాజాన్ని ఎంతోకొంత ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్నవారు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇపుడు కంగనా బీజేపీ అనుకూల వైఖరితో ఉంది కనుక ఆమెపై ఎలాంటి కేసులూ లేవు. ఒకవేళ ఆమె బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఉంటే ఆమెపై ఇప్పటికే రాజద్రోహం కేసులు నమోదై ఉండేవి.

ప్రత్యర్థులపైనేనా కేసులు..
విచిత్రమేమిటంటే ప్రభుత్వాలను విమర్శించే వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్న ప్రభుత్వాలు దేశాన్ని విమర్శించేవారిపై రాజద్రోహం కేసులు ఎందుకు పెట్టడం లేదు అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంటే మనకు సానుభూతిపరులైతే ఎలాంటి కేసులూ ఉండవు.. అదే సమయంలో ప్రత్యర్థులైతే మాత్రమే కేసులుంటాయి. అంటే కంగనాపై రాజద్రోహం పెట్టాలా లేదా.. అసలు రాజద్రోహం వంటి తీవ్రమైన కేసులు ఎప్పుడు పెట్టాలి అనేది వేరే చర్చ. దేశ సార్వభౌమత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నే వారిపై మాత్రమే రాజద్రోహం కేసులు పెట్టాలన్నదానిని అందరూ ఆమోదిస్తారు. ఒక కథనం రాసే జర్నలిస్టుపైనా, ఒక పోస్టు పెట్టే నెటిజన్పైనా రాజద్రోహం కేసులు పెడుతున్న ప్రభుత్వాలు కంగనా ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఎందుకు కేసులు పెట్టడంలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో, ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో దేశద్రోహమైనపుడు దేశాన్ని విమర్శించడం దేశద్రోహం కిందకు రాదా? కంగనా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులెవరూ నోరుమెదపడం లేదు.
స్వాతంత్య్ర సమరయోధులను కించపరచడమే..
1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు.. అది అడుక్కుంటే వచ్చింది అన్న వ్యాఖ్య దేశంలోని లక్షలాదిమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాన్ని అవమానించడమే. ఈ హక్కు కంగనాకు ఎవరిచ్చారు? అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఆ స్వాతంత్య్రపోరాటంలో ప్రాణాలే అర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ సారథ్యంలో దేశంలో అనేక పోరాటాలు జరిగాయి. నాడు పోరాడినవారిని, ఆ స్వాతంత్య్ర సమరయోధులను అడుక్కునేవారితో పోల్చుతూ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలూ ఉండవా? అంటే అధికార పక్షం తరఫున ఉంటే ఇంత రక్షణ ఉంటుందా? 2014లో స్వాతంత్య్రం వచ్చింది అంటే మోదీ ప్రధాని అయ్యిన తర్వాతే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కంగనా ఉద్దేశం. అంటే మహాత్మాగాంధీ కన్నా నరేంద్ర మోదీ గొప్పవాడని ఆమె అర్ధం. అంటే ఒక రకంగా సంఘ్ పరివార్‌లోని ఆ నాటి నాయకులను, వాజ్‌పేయి వంటి మహామహులను కూడా కంగనా విమర్శించినట్లే భావించాలి. సత్తర్సాల్మే జిస్ దేశ్‌మే కుచ్ భీ నహీ హువా అని నరేంద్ర మోదీ తరచుగా అంటుంటారు. అంటే దాని అర్ధం డెబ్బయ్యేళ్లలో ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని.
దేశాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు..
మోదీ చేసిన ఇలాంటి వ్యాఖ్యలే కంగనా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి స్ఫూర్తినిచ్చాయి అని భావించాల్సి ఉంటుంది. ఈ డెబ్బయ్ ఏళ్లలో అటల్ బిహారీ వాజ్‌పేయి పాలన కూడా ఉంది కదా.? 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ పరిపాలించింది. అందులో జనసంఘ్‌కు కూడా భాగం ఉంది కదా.. మరి అలాంటివన్నీ విస్మరించి చరిత్రపై ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? మోదీపై అభిమానం ఉండవచ్చు. వెంకయ్యనాయుడు లాంటి వారు మోదీని దైవదూత అని కీర్తించడం కూడా ఈ దేశం చూసింది. కానీ మోదీని మెచ్చుకోవడానికి దేశ స్వాతంత్య్ర సమరయోధులను ఇలా నిందించడం మాత్రం క్షమార్హం కాదు. 2014 నుంచే దేశం అభివృద్ధి చెందిందని అంటే ఎవరూ తప్పుబట్టేవారు కాదు. కానీ స్వాతంత్య్రాన్ని అడుక్కున్నారు అని అనే స్థాయికి రావడం అంటే భారత స్వాతంత్య్రోద్యమ పోరాటాన్ని అవమానించడం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అవమానించడం. ఇలా దేశాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు.